Studio18 News - ANDHRA PRADESH / : ఈవీఎంలపై నమ్మకం లేదని, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలను నిర్వహించాలని వైసీపీ అధినేత జగన్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ... 2029 ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా ఎన్నికలను నిర్వహిస్తే పోటీ చేయబోనని తెలిపారు. ఈవీఎంల ద్వారా ఎన్నికలను నిర్వహిస్తే... పోటీ చేసినా ఫలితం ఉండదని చెప్పారు. ఈ ఎన్నికల్లో మోసం జరిగినట్టుగానే 2029 ఎన్నికల్లో కూడా మోసం జరుగుతుందని అన్నారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరిగితేనే స్వచ్ఛమైన ఫలితాలు వస్తాయని చెప్పారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో తీర్పు ఇచ్చింది ప్రజలు కాదని... ఈవీఎంలు తీర్పును వెలువరించాయని శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని కౌంటింగ్ పూర్తయిన అరగంటకే ప్రజలు చెప్పారని తెలిపారు. ఈవీఎంలపై ఎంతో మంది అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ... ఎన్నికల సంఘం స్పందించడం లేదని విమర్శించారు. ఈ అంశంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. వచ్చే ఎన్నికలను కూడా ఈవీఎంల ద్వారా నిర్వహిస్తే... ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని, ఈవీఎంల ద్వారా అప్రజాస్వామిక విధానంలో నాయకులు ఎన్నికవుతుంటారని విమర్శించారు.
Admin
Studio18 News