Studio18 News - ANDHRA PRADESH / : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ (సోమవారం) ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలు, సమావేశాలు ఎన్ని రోజులు కొనసాగించాలనే విషయంపై ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు. మంగళవారం (రేపు) గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ జరగనుంది. కాగా అసెంబ్లీ సమావేశాల్లో మూడు శ్వేత పత్రాలను సభ ముందు ఉంచాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించడంతో సమావేశాలపై ఆసక్తి నెలకొంది. శాంతిభద్రతలు, పరిశ్రమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాలను సభ ముందు ఉంచనుంది. మరోవైపు గవర్నర్ ప్రసంగం సమయంలో నిరసన తెలపాలని వైసీపీ నిర్ణయించుకుంది. ఇక ఢిల్లీలో బుధవారం నిరసన తెలపాలని నిర్ణయించిన నేపథ్యంలో మంగళవారం నాటికల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ ఢిల్లీకి రావాలని జగన్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో మంగళవారం నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనే అవకాశం కనిపించడం లేదు.
Admin
Studio18 News