Studio18 News - ANDHRA PRADESH / : ఎన్టీఆర్ జిల్లా కేంద్రం విజయవాడలో కుటుంబ కలహాల కారణంగా ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి విజయవాడ స్ర్కూబ్రిడ్జ్ వద్ద బందరు కాల్వలోకి దూకింది. గమనించిన స్థానికులు ఏడాది వయసు ఉన్న చిన్నారిని బయటకు తీశారు. అనంతరం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చిన్నారి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు మహిళ, మరో చిన్నారి కోసం కాల్వలో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు శారదా కాలనీలో నివాసం ఉంటున్న టి. తిరుపతిరావు రోజువారీ పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య సుధారాణి (28), కుమార్తెలు జాస్వి (18నెలలు), బ్లేసి (4 నెలలు) ఉన్నారు. శనివారం భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఆదివారం ఉదయం తిరుపతిరావు తన భార్య పిల్లలతో కలిసి విజయవాడ కృష్ణలంక కళానగర్ లో ఉంటున్న తన సోదరుడు కోటేశ్వరరావు ఇంటికి వచ్చారు. కృష్ణలంకలోనూ మళ్లీ భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. తర్వాత తిరుపతిరావు బయటకు వెళ్లగా, సుధారాణి తన ఇద్దరు పిల్లలను తీసుకొని స్ర్కూబ్రిడ్జ్ వద్దకు వెళ్లి ముందుగా పిల్లలను కాలువలో పడేసి తానూ దూకింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే నాలుగు నెలల చిన్నారిని బయటకు వెలికి తీసి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గల్లంతైన మిగిలిన ఇద్దరి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చేస్తున్నాయి.
Admin
Studio18 News