Studio18 News - ANDHRA PRADESH / : వెలిగొండ ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత కూడా వైసీపీ అధినేత జగన్ కు లేదని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఈ ప్రాజెక్టుకు గెజిట్ నోటిఫికేషన్ కూడా రాకుండా అడ్డుకున్నది జగనేనని విమర్శించారు. గతంలో చంద్రబాబు సూచనతో ప్రకాశం జిల్లా నేతలమంతా ఢిల్లీకి వెళ్లామని... ప్రాజెక్టు కోసం అప్పటి కేంద్ర మంత్రిని కలిశామని చెప్పారు. అయితే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో జగన్ కుమ్మక్కై రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని వ్యవస్థలను ఐదేళ్ల పాటు నాశనం చేశారని విమర్శించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు పోయి మూడేళ్లైనా దాన్ని పెట్టలేని దుస్థితిలో అప్పటి వైసీపీ ప్రభుత్వం ఉందని గొట్టిపాటి ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్లే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందని, పులిచింతల గేటు కొట్టుకుపోయిందని విమర్శించారు. వైసీపీ నేతలు చేసిన ఇసుక దోపిడీతో ప్రాజెక్టుల భద్రతకు ముప్పు వాటిల్లిందని అన్నారు. జగన్ కొంత కాలం పాటు నోరు తెరవకపోవడమే మంచిదని, లేకపోతే ప్రజలు బుద్ధి చెపుతారని హెచ్చరించారు.
Admin
Studio18 News