Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న ప్రమాదం చాలా బాధాకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ ప్రమాదం వెనుక సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్టుగా తెలుస్తోందని చెప్పారు. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని గతంలో చాలా సార్లు చెప్పామని అన్నారు. ప్రజలు, కార్మికుల భద్రత కోసం సేఫ్టీ ఆడిట్ చేయించాలని చెప్పారు. కాలుష్య నియంత్రణ శాఖ తన పరిధిలో ఉందని... భద్రత వేరే శాఖ కిందకు వస్తుందని అన్నారు. మంగళగిరిలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి వారం ఏదో ఒక ప్రమాదం జరగడం బాధను కలిగిస్తోందని పవన్ చెప్పారు. సంతాపం తెలిపి, పరిహారం ఇస్తే సరిపోదని అన్నారు. రాబోయే 3 నెలల్లో పరిశ్రమల భద్రతపై కార్యాచరణ సిద్ధం చేస్తామని చెప్పారు. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పవన్ తెలిపారు. పంజాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతంపై ఎన్డీయే కూటమి హామీ ఇచ్చిందని చెప్పారు. పంచాయతీ రాజ్ మలిదశ సంస్కరణలు మొదలుపెట్టామని తెలిపారు. ఒకేరోజు 13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
Admin
Studio18 News