Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Ttd Laddu Row : లడ్డూ వివాదంపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. సీఎం చంద్రబాబు ఆరోపణలను ఆయన ఖండించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలుపై విరుచుకుపడ్డారు. నెయ్యి టెస్టింగ్ అయ్యాకనే తిరుమల కొండపైకి ట్యాంకర్లు వెళ్తాయని కొడాలి నాని అన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా ఈ నియమాల్లో మార్పు ఉండదని తేల్చి చెప్పారు. నెయ్యి టెస్టింగ్ ఫెయిల్ అయితే వెనక్కి పంపిన సందర్భాలు చాలా ఉన్నాయన్నారు. తిరుమల చరిత్రలో కొన్ని వందల సార్లు ఇలా రిజెక్ట్ అయ్యాయని ఆయన గుర్తు చేశారు. క్వాలిటీ చెకింగ్ లో ఫెయిలైన ఏవీ వినియోగించారని వ్యాఖ్యానించారు. ”వేంకటేశ్వర స్వామి విశిష్టతను దెబ్బతీసిన చంద్రబాబుకి దేవుడే బుద్ధి చెప్తాడు. వేంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వాడుకునే దుర్బుద్ధి చంద్రబాబుది. ఏ ల్యాబ్ కూడా.. పశువుల కొవ్వు కలిసినట్టు నిర్ధారణ చెయ్యలేదు. అనుమానాలు ఉన్నాయని, ఇంకా పరిశీలన చెయ్యాలి అని రిపోర్టు ఇచ్చాయి. అన్నం తినే వాడు ఎవరూ అంత విశిష్టత ఉన్న దేవుడిని రాజకీయాల్లోకి లాగడు. చంద్రబాబు వేంకటేశ్వర స్వామి భక్తుడు అయితే ఒక్క సారైనా గుండు కొట్టించుకున్నాడా..? సిట్ కాదు సీబీఐ లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి. చంద్రబాబు.. మా మక్కెలు విరగ్గొట్టడం కాదు.. దళితులపై దాడులు చేసిన పంతం నానాజీ, రఘురామ కృష్ణరాజు మక్కేలు విరగొట్టు. పార్టీ నేతలు, కార్యకర్తలను చంద్రబాబు కంట్రోల్ చెయ్యలేక పోతున్నాడు. చంద్రబాబుకి కుటుంబం అయినా దేవుడైనా రాజకీయ కోసమే. వేంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వాడుకున్న వారి మక్కెలు ఆయనే విరగ్గొతారు” అని హెచ్చరించారు కొడాలి నాని. ”అంత ప్రతిష్ట కలిగిన గుడిని, అన్ని మహిమలు కలిగిన ఆ స్వామిని.. అన్నం తినే వాడు ఎవడైనా రాజకీయాల కోసం బజారుకి లాగుతాడా. చంద్రబాబు నాయుడు శ్రీవారి భక్తుడా? నాకు 50 ఏళ్లు. ఈ 50 ఏళ్లలో 45 సార్లు నేను తిరుపతి వెళ్లాను. 20 సార్లు గుండు కొట్టించుకున్నా. 15 సార్లు కాలినడకన తిరుమల వెళ్లా. ప్రతి ఏటా తిరుమల వెళ్తాను. చంద్రబాబు తిరుమల వెళ్లి ఎన్నిసార్లు గుండు కొట్టించుకున్నారు? వేంకటేశ్వర స్వామికి ఇష్టమైనది తలనీలాలు. మహిళా భక్తుల కూడా తిరుమల వెళ్లి గుండు చేయించుకుంటారు. చంద్రబాబు ఎన్నిసార్లు గుండు చేయించుకున్నారు? చంద్రబాబు వేంకటేశ్వర స్వామి భక్తుడా? రాజకీయాల కోసం శ్రీవారిని వాడుకుంటున్నారు. జగన్ ను రాజకీయంగా దెబ్బకొట్టాలని అనుకుంటే.. డైరెక్ట్ గా రా.. ఆయన సిద్ధంగా ఉన్నాడు. వేంకటేశ్వర స్వామిని, మతాలను, కులాలను విచ్చిన్నం చేసే పెద్ద కుట్రగా దీన్ని మేము భావిస్తున్నాం” అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కొడాలి నాని.
Admin
Studio18 News