Studio18 News - ANDHRA PRADESH / : Heavy Rains In Vijayawada : ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడలో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని భారీ వర్షం కురుస్తుంది. దీంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. భారీ వర్షం కారణంగా నగరవాసులకు పోలీసులు కీలక సూచన చేశారు. ద్విచక్ర వాహనదారులు మరి కొన్ని గంటల పాటు రోడ్ల పైకి రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. వీవీఐపీలు బయటకు రావొద్దని సూచించారు. ఎడతెరిపిలేని వర్షంతో నగరంలో ప్రధాన రోడ్లన్నీ జలమయంగా మారాయి. పలు ప్రధాన రహదారుల్లో మోకాళ్ల మేర లోతు వర్షపు నీరు చేరింది. దీంతో వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ రహదారుల నుంచి సర్వీస్ రోడ్లలోకి వాహనాల మళ్లిస్తున్నారు. జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలు అనుమతించ వద్దని పోలీసుల ఆదేశాలు జారీ చేశారు. విజయవాడలోకి వచ్చే వాహనాలు దారి మళ్లిస్తున్నారు. పొట్టిపాడు టోల్ గేట్ వద్ద జాతీయ రహదారిపై, బెంజ్ సర్కిల్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. బెంజ్ సర్కిల్ నుంచి ఆటో నగర్ వరకు ఎంజీ రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. నగరంలోని ప్రధాన రోడ్లపై మోకాలి లోతు నీళ్ళు చేరింది. నగరంలోకి వచ్చే వాహనాలు మొత్తం దారి మళ్లిస్తున్నారు. ఎస్కార్ట్ వాహనాలను ముందస్తు అనుమతి లేకుండా నగరంలోకి అనుమతించకూడదని స్థానిక అధికారులకు సూచనలు చేశారు. భారీ వర్షం కారణంగా మొఘల్ రాజ్ పురంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. కొండపై నుంచి బండరాళ్లు దొర్లడంతో పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఓ ఇల్లు పూర్తిగా ధ్వంసం కాగా.. ఇద్దరు మరణించారు. మరో ఇద్దరు బండరాళ్ల కింద చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈ ప్రమాదంలో మరికొందరు గాయపడ్డారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో ఫైర్ ఇంజన్లతో నీళ్లను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పాతబస్తీలో ఔట్ ఫాల్ డ్రెయిన్ పొంగడంతో ఇళ్లలోకి నీరు చేరింది. నిడమానూరు నుంచి టంకసాల వరకు జాతీయ రహదారి పూర్తిగా నీట మునిగింది. ఎన్‌టీఆర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలోనే అందుబాటులో ఉండి అవసరం మేరకు సహాయసహకారాలు అందించాలని ఆదేశించారు. రెవెన్యూ, విద్యుత్తు, గ్రామీణ నీటి సరఫరా, మునిసిపల్, రహదారులు అండ్ భవనాలు తదితర శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజల విజ్ఞప్తి మేరకు తక్షణం స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు 0866-2575833 నంబర్ కి ఫోన్ చేసి సమస్యను తెలియజేయవచ్చునని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన సూచించారు.
Admin
Studio18 News