Studio18 News - ANDHRA PRADESH / : విజయవాడను ముంచెత్తిన బుడమేరు గండ్లను పూడ్చివేసే కార్యక్రమాలను పర్యవేక్షించాలని మంత్రి నారా లోకేశ్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు నారా లోకేశ్ రంగంలోకి దిగారు. బుడమేరు కుడివైపు, ఎడమవైపు పడిన గండ్ల గురించి అధికారులను అడిగి వివరాలను లోకేశ్ తెలుసుకున్నారు. గండ్లు పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. లోకేశ్ పర్యవేక్షణలో విజయవాడలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సీఎం ఆదేశాల మేరకు లోకేశ్ బుడమేరు వద్దకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. విజయవాడలో వరద ప్రభావానికి గురైన 36 వార్డుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నిన్న రాత్రి, ఈ ఉదయం ఎగువన కురిసిన వర్షాల వల్ల బుడమేరుకు 10 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... బుడమేరు పరివాహక ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ... కొండపల్లి శాంతినగర్ వద్ద ఉన్న చెరువు కట్ట కూడా తెగిందని చెప్పారు. బుడమేరు పరివాహక ప్రాంతంలో ఉన్నవారంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాను జక్కంపూడి కాలనీ, గొల్లపూడి మార్కెట్ యార్డ్ లో వరద బాధితులకు ఆహారాన్ని పంపిణీ చేసే పనుల్లో నిమగ్నమై ఉన్నానని చెప్పారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా తనకు ఫోన్ చేయాలని సూచించారు.
Admin
Studio18 News