Studio18 News - ANDHRA PRADESH / : నిన్నటి నుంచి ఏపీ వ్యాప్తంగా చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు కోరుకున్న విధంగా చౌకధరల దుకాణాల ద్వారా పండుగ వాతావరణంలో రేషన్ పంపిణీ విధానానికి శ్రీకారం చుట్టిన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌కు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. ఇది పురోగమన విధానమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. పేదలకు సక్రమంగా నిత్యావసరాలు అందేలా చూడాలనే కూటమి ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనం అన్నారు. గత ప్రభుత్వంలో తొలిరోజు సగటున 11 లక్షల మంది రేషన్ తీసుకోగా.. నిన్న ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 18.87 లక్షల కుటుంబాలు రేషన్ అందుకున్నాయని తెలిపారు. ఎప్పుడు వస్తుందో తెలియని రేషన్ వాహనాల కంటే షాపుల వద్దకు వెళ్లడమే ప్రజలు సౌకర్యంగా భావిస్తున్నారనేందుకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. ఇక పనులు మానుకుని రేషన్ వాహనాల కోసం పడిగాపులు కాయాల్సిన పనిలేదన్నారు. 15 రోజుల వరకు చౌకధరల దుకాణాల్లో రేషన్ పొందవచ్చని చెప్పారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటివద్దకే రేషన్ అందిస్తామన్నారు. భవిష్యత్ లోనూ ప్రజల ఆకాంక్షల మేరకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి లోకేశ్ చెప్పుకొచ్చారు.
Admin
Studio18 News