Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : AP High Court : వైసీపీ నేతలకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, నందిగం సురేశ్, అప్పిరెడ్డిలు హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం ముందస్తు బెయిల్ పిటీషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. వైసీపీ నేతల పిటీషన్లను తిరస్కరించింది. అయితే, హైకోర్టు ఉత్తర్వులను రెండు వారాల పాటు సస్పెండ్ చేసి, సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని వైసీపీ నేతల తరపు న్యాయవాదులు హైకోర్టును కోరారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఉందని న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు తీర్పు అలా లేదని తీర్పు కాపీని హైకోర్టుకు టీడీపీ న్యాయవాదులు అందజేశారు. అయితే, ఈ విషయంపై పరిశీలించి తుది ఉత్తర్వులు మధ్యాహ్నం తరువాత ఇస్తామని హైకోర్టు పేర్కొంది. చంద్రబాబు నాయుడు నివాసంపై దాడికి సంబంధించిన కేసులో బెయిల్ కోసం వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ వేసిన పిటీషన్ ను కూడా ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఇదిలాఉంటే.. 2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో పోలీసులు నామమాత్రంగా కేసు నమోదు చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఈ ఘటనపై దృష్టిసారించింది. దీంతో దాడి ఘటనపై మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటి ఈ కేసులో మొత్తం 21 మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపించారు. మిగిలిన 85 మందికి మంగళగిరి రూరల్ పోలీసులు గత నెల 19న నోటీసులు జారీ చేశారు. వీరిలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితోపాటు విజయవాడకు చెందిన వైసీపీ నేత దేవినేని అవినాశ్ తో పాటు పలువురు ఉన్నారు. అయితే, ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ నేతలు ఏపీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పిటీషన్లను హైకోర్టు కొట్టేసింది.
Admin
Studio18 News