Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామంటూ హామీ ఇచ్చి అధికారం చేపట్టాక మాటమార్చారంటూ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పి ఇప్పుడు జిల్లా పరిధిలోనే ఉచితమని కొర్రీలు పెడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో ఆంక్షలు పెడుతున్నారంటూ మండిపడుతున్నారు. వైసీపీ విమర్శలపై తాజాగా టీడీపీ నేతలు స్పందించారు. మొదటి నుంచి జిల్లా పరిధిలో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామనే తమ నాయకుడు హామీ ఇచ్చారని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన వీడియోతో వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. ‘జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చని టీడీపీ చీఫ్ చంద్రబాబు, యువనేత నారా లోకేశ్ ఎన్నికల ప్రచారంలో స్పష్టమైన హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీని అమలు చేస్తోంది. ఈ హామీతో మహిళలకు మేలు జరగడం ఓర్వలేని జగన్ ఉచిత బస్సు ప్రయాణంపై విషం కక్కుతున్నాడు’’ అంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు. కాగా, ఈ విషయాన్ని వైసీపీ నేత శాసనమండలిలో లేవనెత్తగా మంత్రి గుమ్మడి సుధారాణి జవాబిస్తూ.. ‘ఉచిత బస్సు పథకం కింద జిల్లాల్లో మహిళలు ప్రయాణం చేయవచ్చు, ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వస్తే మాత్రం టికెట్ తీసుకోవాలి’ అని తెలిపారు.
Admin
Studio18 News