Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీలో కొత్త వైన్ షాపులను నిన్న లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేశారు. లాటరీలో షాపు తగిలిన వారు సంతోషంలో మునిగిపోగా... అదృష్టం వరించని వారు నిరాశలో మునిగిపోయారు. పలు చోట్ల పలువురు వ్యక్తులు సిండికేట్లుగా ఏర్పడి వారి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. రాజకీయ నాయకులు సైతం పెద్ద ఎత్తున వైన్ షాపుల కోసం పోటీ పడ్డారు. నంద్యాల దివంగత మాజీ ఎంపీ, పారిశ్రామికవేత్త ఎస్పీవై రెడ్డి కుమార్తె సుజల మద్యం షాపుల టెండర్లలో పలు షాపులు దక్కించుకున్నారు. అన్నమయ్య జిల్లాలో 6, అనంతపురం జిల్లాలో 4, కర్నూలు జిల్లాలో ఒకటి సహా పీలేరు నియోజకవర్గంలో కూడా షాపులు దక్కించుకున్నారు. మరోవైపు, ఏపీ మంత్రి పి.నారాయణ తన అనుచరుల కోసం రూ. 2 కోట్ల సొంత డబ్బుతో 100 మంది కార్యకర్తల ద్వారా వైన్ షాపులకు దరఖాస్తు చేశారు. 100 దరఖాస్తులకు గాను వారికి మూడు షాపులు దక్కాయి. దీంతో, ఒక్కో షాపును ఆరుగురు డివిజన్ ఇన్ఛార్జీల చొప్పున 18 మందికి ఆయన షాపులను అప్పగించారు. చట్టబద్ధంగా వ్యాపారం చేసుకోవాలని వారికి సూచించారు. ఇంకోవైపు, మచిలీపట్నంలోని ఒకటో నెంబర్ షాపును కర్ణాటకకు చెందిన మహేశ్ బాటే దక్కించుకున్నారు. రెండో షాపు ఉత్తరప్రదేశ్ కు చెందిన లోకేశ్ చంద్ కు దక్కింది. ఈ రెండు షాపులను తమకు ఇవ్వాలని వారితో స్థానిక వ్యాపారులు బేరసారాలకు దిగినట్టు సమాచారం.
Admin
Studio18 News