Studio18 News - ANDHRA PRADESH / : ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో వర్షాలపై మంత్రులు, జిల్లా కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కాలువలు, చెరువులు, నీటి వనరుల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెరువు కట్టలు, కాలువల కట్టలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. కాలువలు, వాగుల వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టాలని తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చెప్పారు. వర్షాలపై ప్రజల మొబైల్ ఫోన్లకు మెసేజ్ లు పంపుతూ అలర్ట్ చేయాలని సూచించారు. కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని... ప్రజల నుంచి వచ్చే వినతులపై వేగంగా స్పందించాలని అన్నారు. మరోవైపు... ఉమ్మడి అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. ఆ జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచామని చెప్పారు.
Admin
Studio18 News