Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసిందని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఆ ప్రభుత్వ హయాంలో రవాణాశాఖలో భారీగా అక్రమాలు జరిగాయని, భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. వాటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, అక్రమార్కుల భరతం పడతామని చెప్పారు. రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విడగొట్టి, ఒక్కో జోన్ కు ఒక్కో అధికారిని పెట్టి వసూళ్లకు పాల్పడ్డారని విమర్శించారు. ఈ దందాకు ఒక ఉన్నతాధికారి పూర్తిగా సహకరించారని చెప్పారు. వీటిపై విచారణ వేస్తున్నామని... విచారణలో అందరి పేర్లు బయటకు వస్తాయని తెలిపారు. అక్రమాలు బయటపడకుండా ఫైళ్లను తగులబెట్టడాన్ని ఒక మార్గంగా ఎంచుకున్నారని అచ్చెన్నాయుడు చెప్పారు. కొన్ని రోజులుగా ఇలాంటి ఘటనలు చాలా చోటుచేసుకున్నాయని అన్నారు. అక్రమాలను వెలికి తీస్తామనే భయంతోనే ఫైళ్లను తగులబెడుతున్నారని దుయ్యబట్టారు. చివరకు తిరుపతిలో కూడా స్వామివారి ధనాన్ని దోచుకున్నారని, కోట్లు స్వాహా చేశారని, అవన్నీ బయటకు వస్తాయనే భయంతో అక్కడ కూడా రికార్డులను తగులబెట్టారని మండిపడ్డారు. బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పని చేసిన వాసుదేవరెడ్డి అవినీతి వ్యవహారాలపై అనేక ఫిర్యాదులు అందాయని, వాటిపై విచారణ జరుగుతోందని అచ్చెన్న తెలిపారు.
Admin
Studio18 News