Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అరెస్టయిన మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇవాళ గుంటూరు జైల్లో పరామర్శించడం తెలిసిందే. దీనిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నందిగం సురేశ్ ఏమైనా స్వాతంత్ర్య సమరయోధుడా... అతడిని పరామర్శించేందుకు జగన్ రావడం సిగ్గుచేటు అని విమర్శించారు. వరదలు పోటెత్తి ప్రజలు కష్టాల్లో ఉంటే పట్టించుకోని జగన్ రెడ్డి... రెండు ఘటనల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పరామర్శించడానికి వచ్చి ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలుతున్నాడంటూ మండిపడ్డారు. వేల కోట్లు ఆస్తులు ఉన్నా వరద బాధితులకు ఒక్క రూపాయి సాయం చేయకపోగా... నిందితుడిగా ఉన్న వ్యక్తిని పరామర్శించేందుకు వచ్చి సూపర్ సిక్స్ పథకాలపై విషం చిమ్మిపోయాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నందిగం సురేశ్ జీవితం అంతా ఒక క్రైమ్ స్టోరీనే అని, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడిలో ముఖ్య పాత్ర వహించిన నేతల్లో నందిగం సురేశ్ ఒకరని మండిపల్లి ఆరోపించారు. ప్రకాశం బ్యారేజి గేట్లను బోట్లు ఢీకొట్టడంలోనూ నందిగం హస్తం ఉందని అన్నారు. "ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం. 20 లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది మందికి తాగునీరు అందిస్తున్న బ్యారేజ్ ను ధ్వంసం చేయాలని వైసీపీ నేతలు కుట్ర పన్నారు. జగన్ రెడ్డికి అసలు సిగ్గూ శరం లేదు... లక్షలాది మంది ప్రజలు ఆకలి కేకలితో ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకుండా బెంగళూరు వెళ్లి మళ్లీ సిగ్గులేకుండా వచ్చి నేడు మాట్లాడుతున్నారు. ప్రజలపై మమకారం ఉంటే ఒక్క రూపాయి అయినా ఇచ్చారా... చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థతో పాటు అనేక సంస్థలు కోట్ల రూపాయలు ఇచ్చాయి" అని మండిపల్లి వివరించారు.
Admin
Studio18 News