Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు నేతలు, కార్యకర్తలు పార్టీని వీడగా మరికొందరు అదే ప్రయత్నంలో ఉన్నారు. తాజాగా, వైసీపీకి మరో షాక్ జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను నుంచి రానుంది. ఎన్నికల తర్వాత సైలెంట్ అయిపోయిన ఆయన తాజాగా పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల తర్వాత ఆయన నియోజకవర్గంలోని జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ సహా 18 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. దీంతో ఒంటరిగా మారిన ఆయన కూడా పార్టీని వీడి జనసేనలో చేరాలని యోచిస్తున్నట్టు చెబుతున్నారు. చిరంజీవి కుటుంబంతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండడం కూడా ఈ వార్తలకు ఊతమిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాజీ ఎంపీ కేశినేని నాని తొలుత వైసీపీకి టాటా చెప్పేశారు. ఆ తర్వాత రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. సినీ నటుడు అలీ కూడా తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని ప్రకటించారు. మద్దాలి గిరి, కిలారు రోశయ్య, సిద్దా రాఘవరావు, మాజీ మంత్రి ఆళ్ల నాని వంటి వారు పార్టీని వీడారు. అయితే, వారింకా ఏ పార్టీలోనూ చేరలేదు. తాజాగా, జగన్ సన్నిహితుడిగా పేరు సంపాదించుకున్న ఉదయభాను పార్టీకి గుడ్‌బై చెప్పనున్నట్టు తెలుస్తోంది.
Admin
Studio18 News