Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత పేర్నినాని చేసిన వ్యాఖ్యలపై జనసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేర్ని నాని ఇంటి ముందు ఆందోళన చేపట్టి... ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడకు చేరుకున్న పోలీసులు కొందరు జనసేన నేతలను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారిని అక్కడి నుంచి పంపించేశారు. ఈ నేపథ్యంలో పేర్ని నాని మాట్లాడుతూ... ఉడుత ఊపులకు, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. సినిమా హీరోగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన పవన్... నోటికొచ్చినట్టు, ఒక సిద్ధాంతం అనేది కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హిందువులను రెచ్చగొడుతున్నారని... బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎం పదవిలో ఉండి అలా చేయడం సిగ్గుచేటని అన్నారు. నిన్న మధ్యాహ్నం తాను పవన్ ను ప్రశ్నించానని... అందుకే ఒక ప్లాన్ ప్రకారం జనసేన కార్యకర్తలను ఈరోజు తన ఇంటిపైకి పవన్ పంపించారని దుయ్యబట్టారు. మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో... మీ ఇంటికి కూడా మా ఇల్లు అంతే దూరమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
Admin
Studio18 News