Studio18 News - ANDHRA PRADESH / : వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి టాటా చెప్పేయబోతున్నారా? అవుననే అంటున్నారు ఆయన వర్గీయులు. ప్రాధాన్యం దక్కనిచోట తాను ఉండలేనని అధినేత జగన్‌కు బాలినేని చెప్పేశారట. తన దారి తాను చూసుకోబోతున్నానని, ఇక తనను వదిలేయాలని తేల్చి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆయన జనసేనలో చేరబోతున్నట్టు కూడా చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దారుణ పరాభవం తర్వాత ఒంగోలును వీడిన బాలినేని హైదరాబాద్‌కు మకాం మార్చారు. ఆ తర్వాత వైసీపీ సమావేశాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆయన.. అధినేత జగన్‌ను కూడా కలవలేదు. ఇటీవల ఒకసారి ఒంగోలు వచ్చినా మరుసటి రోజే మళ్లీ వెళ్లిపోయారు. కార్పొరేటర్లు పార్టీని వీడుతున్నా వారిని వారించే ప్రయత్నం చేయలేదు. మూడు నెలలపాటు వైసీపీకి దూరంగా ఉన్న బాలినేని బుధవారం రాత్రి తాడేపల్లి ప్యాలెస్‌లో అధినేత జగన్‌తో సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాలు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఒంగోలు జిల్లా పార్టీ బాధ్యతలను తీసుకోవాలని జగన్ చేసిన ప్రతిపాదనను బాలినేని తిరస్కరించినట్టు తెలిసింది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతల నుంచి తప్పించి ఇప్పుడు బాధ్యతలు అప్పగిస్తాననడంపై ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన జనసేన వైపు అడుగులు వేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని కూడా తెలిసింది. అయితే, బాలినేని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని, పార్టీలో పూర్వ వైభవం కోసమే ఆయనీ నాటకం ఆడుతున్నారని మరికొందరు చెబుతున్నారు.
Admin
Studio18 News