Studio18 News - ANDHRA PRADESH / : అసెంబ్లీకి వెళ్లకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న షర్మిల వ్యాఖ్యలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ స్పందించారు. తన సోదరి గురించి ఇక్కడ మాట్లాడవద్దని మీడియాతో అన్నారు. బుధవారం క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సమయంలో షర్మిల వ్యాఖ్యలను ఓ మీడియా ప్రతినిధి ప్రస్తావించారు. మీరు రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు కదా? అని ప్రశ్నించారు. షర్మిల గురించి మాట్లాడవద్దని... అయినా వారికి ఏపీలో 1.7 శాతం మాత్రమే ఓటు బ్యాంకు ఉందన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి అస్తిత్వమే లేదని, ఇక వారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమిటన్నారు. అసెంబ్లీకి వెళ్లకుంటే అనర్హత వేటు వేస్తారా? అలా అయితే సిద్ధమే... వేయమనండని జగన్ అన్నారు. అనర్హత వేటు అంశం వీళ్ల చేతిలో లేదన్నారు. అలా చేస్తే హైకోర్టుకు వెళ్తామన్నారు. కోర్టు చెబితే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అన్నారు. తమకు 40 శాతం ఓట్లు వేసి ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చారని పేర్కొన్నారు. సభలో వైసీపీ మాత్రమే ప్రతిపక్షం కాబట్టి తమకు ఇవ్వాల్సిందే అన్నారు. నా నుంచే అరెస్ట్ మొదలు కావాలి హామీలపై ప్రశ్నిస్తే ప్రభుత్వం కేసులు పెడుతుందా? అని జగన్ మండిపడ్డారు. సూపర్ సిక్స్‌కు కావాల్సిన బడ్జెట్ రూ.74 వేల కోట్లు అని, కానీ వారు బడ్జెట్‌లో కేటాయించింది ఎంత? అని నిలదీశారు. అబద్ధాలు చెబుతున్నారని, అలాంటి వారి మీద 420 కేసు ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. చంద్రబాబుపై 420 కేసు ఎందుకు పెట్టకూడదంటూ నేనే సోషల్ మీడియాలో పోస్ట్ పెడతాను... మా ఎమ్మెల్యేలు పెడతారు... మా ప్రతి కార్యకర్త ఈ పోస్ట్ పెట్టాలని పిలుపునిస్తున్నాను... ప్రతి ఒక్కరూ వారి వారి సోషల్ మీడియాలో ఈ పోస్టులు పెట్టండి.. అని పిలుపునిచ్చారు. అప్పుడు ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూస్తానని మండిపడ్డారు. అరెస్ట్ చేయాలంటే తన నుంచే మొదలు కావాలన్నారు. అప్పులపై అబద్ధపు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమయంలో రాష్ట్ర అప్పు రూ.10 లక్షల కోట్లు అంటూ గవర్నర్‌తో అబద్ధం చెప్పించారని, ఇప్పుడు మాత్రం రూ.6.46 లక్షల కోట్లుగా పేర్కొన్నారన్నారు. మరి మొదట చెప్పిన లక్షల కోట్లు ఎక్కడకు పోయాయని ప్రశ్నించారు. వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని కూటమి ప్రభుత్వం చెబుతోందని... కానీ అవన్నీ తమ హయాంలో పునాది పడినవే అన్నారు.
Also Read : మన దేశంలో ప్రతి గంటకు ఇంత మంది చనిపోతున్నారా?
Admin
Studio18 News