Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : గంజాయి వినియోగం, అక్రమ రవాణను అరికట్టేందుకు ఏపీ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించే వాహనాల తనిఖీల్లో గంజాయి పట్టుబడుతోంది. పోలీసులు, సెబ్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ గంజాయి అక్రమ రవాణాపై కేసులు నమోదు చేస్తున్నా కొందరు అక్రమార్కులు అధికారుల కళ్లు గప్పి రవాణా చేస్తూనే ఉన్నారు. తాజాగా, గుంటూరు జిల్లాలో స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో (సెబ్) అధికారులు శనివారం భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నుండి తమిళనాడుకు రెండు కార్లలో అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు పక్కా సమాచారం రావడంతో సెబ్ అధికారులు మంగళగిరి మండలం కాజా టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేశారు. రెండు కార్లలో అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించి ఆ వాహనాలను సీజ్ చేశారు. అయిదుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 230 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు చెందిన ఈ అయిదుగురు వ్యక్తులు గత కొంత కాలంగా విశాఖ నుండి గంజాయి తీసుకొస్తున్నట్లు సెబ్ అధికారులు గుర్తించారు.
Admin
Studio18 News