Studio18 News - ANDHRA PRADESH / : చంద్రబాబు గారూ పేద విద్యార్థులను చదువులకు దూరం చేసే మీ కుట్రపై వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యయుతంగా 'యువత పోరు' ద్వారా గళమెత్తిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులపై పోలీసుల దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ వైసీపీ అధినేత జగన్ ట్వీట్ చేశారు. పలుచోట్ల పోలీసులతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూసినా వాటన్నింటినీ అధిగమించి ఈ సంవత్సర కాలంగా మీ ప్రభుత్వం పెడుతున్న కష్టాలపై విద్యార్థులు నిలదీశారని వెల్లడించారు. "చంద్రబాబు గారూ... నిరుద్యోగులు, విద్యార్థులు మీకు పంపిన తొలి హెచ్చరిక ఇది. పేదరికం వల్ల పెద్ద చదువులకు ఎవ్వరూ దూరం కాకూడదన్న దృఢ సంకల్పంతో మా ప్రభుత్వం విద్యాదీవెన ద్వారా సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను, వసతి దీవెన ద్వారా హాస్టల్, మెస్ ఛార్జీలను నేరుగా వారి తల్లులు, ఆ పిల్లల ఖాతాలకే జమచేస్తూ, అమలు చేసిన ఈ పథకాలను మీ ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చింది. చంద్రబాబుగారూ... మీ గత పాలనలోని ఆ చీకటి రోజులనే మళ్లీ మీరు తీసుకువచ్చారు. 2024 జనవరి - మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బును ఏప్రిల్‌లో వెరిఫై చేసి, మేలో చెల్లించాల్సి ఉంది. అక్కడ నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున ఏడాదికి రూ.2,800 కోట్లు ఇవ్వాలి. వసతి దీవెన కింద హాస్టల్ ఖర్చులకు మరో రూ.1,100 కోట్లు ఇవ్వాలి. ప్రతి ఏడాదికి ఈ రెండు పథకాలకు రూ.3,900 కోట్లు ఖర్చు చేయాలి. కానీ చంద్రబాబుగారూ, మీరిచ్చింది కేవలం రూ. 700 కోట్లు. అదికూడా ఇప్పటికీ పూర్తిగా పిల్లలందరికీ చేరలేదు. దీని అర్థం పేద విద్యార్థుల చదువులు, వారి బాధ్యత విషయంలో మీరు తప్పించుకుంటున్నట్టే కదా? ఆ పిల్లల జీవితాలను అంధకారంలోకి నెడుతున్నట్టే కదా? చదువుకుంటున్న పిల్లలకు మీరు చేస్తున్న ద్రోహం కాదా? విద్యార్థులను ఇంతగా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు చంద్రబాబుగారూ? అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు లేదా అందాక నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే ప్రతి ఏటా రూ.7,200 కోట్లు ఖర్చు చేయాలి. కాని, గత ఏడాది బడ్జెట్లో ఒక్కపైసా కేటాయింపూ లేదు. ఈ ఏడాదికి కూడా ఒక్కపైసా కేటాయించలేదు. ఈ రెండేళ్లలోనే ప్రతి నిరుద్యోగికీ రూ.72 వేల చొప్పున బకాయి పడ్డారు. అలాగే వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేటు పరం చేస్తూ, పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందనీయకుండా అడ్డుకోవడమే కాదు, పేద విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాదికూడా కాకముందే మిమ్మల్ని ప్రశ్నిస్తూ, నిరుద్యోగులు, ఇంతమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డెక్కడం ఎప్పుడైనా చూశారా చంద్రబాబుగారూ? ప్రజల పక్షాన నిలుస్తూ, విద్యార్థుల సమస్యలపై, వారికోసం చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ 'యువత పోరు' కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పిల్లలు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలందర్నీ అభినందిస్తున్నాను. అనేక సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థుల సహా అన్నివర్గాలకూ పార్టీ ఎప్పుడూ తోడుగా నిలుస్తుందని భరోసా ఇస్తున్నాను" అని జగన్ పేర్కొన్నారు.
Admin
Studio18 News