Studio18 News - ANDHRA PRADESH / : Pawan Kalyan Video Message on Vana Mahotsav : ఏపీ ప్రభుత్వం వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖా మాత్యులు పవన్ కల్యాణ్ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. వన మహోత్సవాన్ని ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలయ్యే కార్యక్రమాల్లో విధిగా పాల్గొనాలని పవన్ పిలుపునిచ్చారు. పచ్చదనంతో రాష్ట్రమంతా కళకళలాడాలని, అదే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29శాతం మాత్రమే పచ్చదనం ఉంది. విరివిగా ప్రతిఒక్కరూ మొక్కలను నాటడం ద్వారా, వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో 50 శాతానికి పచ్చదనం పెరగాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు. మొక్కల పెంపకం అనేది ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యేది కాదు. ప్రతిఒక్కరూ తమకు అనువైన ప్రదేశాల్లో మొక్కలను నాటి, వాటి పెరుగుదలకు తగిన బాధ్యత తీసుకోవాలని పవన్ కల్యాణ్ కోరారు. కోనో కార్పస్ మొక్కలతో అనర్థాలు.. మన దేశ భౌగోళిక పరిస్థితులకు విరుద్ధంగా ఉండే, అన్య జాతుల మొక్కలు నాటడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. వేగంగా పెరుగుతాయని, ఎవెన్యూ ప్లాంటేషన్ అని, నిర్వహణ ఖర్చులు తక్కువ అనే కోణంలో గత దశాబ్ద కాలంగా కోనో కార్పస్, ఏడు ఆకుల పాల, మడగాస్కర్ ఆల్మన్, ఆస్ట్రేలియా తుమ్మ వంటి అన్యజాతుల మొక్కలను నాటారు. వీటి వల్ల పర్యవరణానికి మేలు కంటే కూడా కీడు అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అన్య జాతుల మొక్కలు- భూగర్భ జలసంపద మీద ప్రభావం చూపడంతోపాటు మనిషికి ఆరోగ్యపరంగానూ ఇబ్బందులు తెస్తాయి. ఈ మొక్కలు నాటుదాం.. కార్తీకమాసం వనసమారాధన వరకు జరిగే ఈ వన మహోత్సవం వేళ దేశీయ జాతుల మొక్కలను, అందరికీ మేలుచేసే మొక్కలను విరివిగా పెంచుదాం. కానుగ, వేప, రావి, చింత, ఉసిరి, శ్రీగంధం, మర్రి, అశోక, రేలా, దిరిసెం మారేడు, నేరేడు, దేవకాంచన, తెల్లమద్ది, మామిడి, కదంబం, జమ్మి, సీత అశోక, వెలగ, సీతాఫల వంటి ఎన్నో మనకు ఉపయోగపడే మన జాతుల మొక్కలను పెంచుదామని పవన్ కల్యాణ్ సూచించారు. అందరికీ మేలు చేసే మొక్కలే మన నేస్తాలు. అందరం సమష్టిగా వన మహోత్సవంలో పాల్గొని రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపుదాం. ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా ముందుకొచ్చి వన మహోత్సవాన్ని జయప్రదం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు.
Admin
Studio18 News