Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Fire Accident : విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం పరిధిలోని పెనుబాక గ్రామ సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న సీతారామ ఆయిల్ ఇండస్ట్రీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవటంతో గోదాంలోని సరుకు దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలంకు చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. స్థానిక అధికారులు, పోలీసులు ఘటన స్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో అగ్నిప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని నిర్ధారణకు వచ్చారు. ప్రమాదం సంభవించిన సమయంలో ఆయిల్ పరిశ్రమంలో ఎవరూ లేకపోవటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. రాజాం -చీపురుపల్లి రోడ్ లోని తిమ్మయ్యపేట సమీపంలో సీతారామ ఆయిల్ కర్మాగారం ఉంది. ఆదివారం రాత్రి 9గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. తవుడు నుంచి ఆయిల్ ను తీయగా మిగిలిన ముడిసరుకు అగ్నికి ఆహుతైంది. గోదాంలో సుమారు కోటి విలువైన పశువుల దాణా ఉండగా సగానికిపైగా మంటల్లో కాలిపోయిందని యాజమాన్యం ప్రతినిధులు తెలిపారు. భారీగా ఎగిసిపడిన మంటలు అర్థరాత్రి వరకు కొనసాగాయి. మంటల కారణంగా వేడికి గిడ్డంగి పైభాగంతోపాటు గోడలు దెబ్బతిన్నాయి. రాజాం ఎస్ఐ రవికిరణ్ అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Admin
Studio18 News