Studio18 News - ANDHRA PRADESH / : వైసీపీ అధినేత జగన్ కు ఏలేరు రిజర్వాయర్ గురించి మాట్లాడే అర్హత లేదని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. భారీ వరద వచ్చినప్పటికీ ప్రభుత్వ అప్రమత్తత వల్ల ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. 114 చోట్ల కట్ట బలహీనతలను గుర్తించి, వాటిని పటిష్ఠం చేశామని తెలిపారు. టీఎంసీలకు, క్యూసెక్కులకు... నదికి, వాగుకు మధ్య ఉన్న తేడా ఏంటో తెలియని వ్యక్తి జగన్ అని ఎద్దేవా చేశారు. ఈ నెల 4 నుంచే జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ శాఖ అధికారులు ఏలేరులో పెరుగుతున్న ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అప్రమత్తంగా ఉన్నారని నిమ్మల చెప్పారు. జగన్ నిర్లక్ష్యం వల్లే వైసీపీ హయాంలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందని దుయ్యబట్టారు. శవాలు కనిపిస్తే జగన్ కు ఆనందంగా ఉంటుందని అన్నారు. ఎంతో కష్టపడి ఏలేరు వద్దకు జగన్ వెళ్లారని... అయితే అక్కడ శవాలు కనిపించకపోవడంతో నిరాశకు గురై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాడని ఎద్దేవా చేశారు. జగన్ విధ్వంసానికి ఏలేరు రిజర్వాయర్ కూడా బలైందని నిమ్మల చెప్పారు. 2014-19 మధ్య కాలంలో ఏలేరు ఆధునికీకరణకు టీడీపీ ప్రభుత్వం రూ. 93 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. 2019-24 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో జగన్ చెప్పగలరా? అని ప్రశ్నించారు.
Admin
Studio18 News