Studio18 News - ANDHRA PRADESH / : Attack On Mla Chirri Balaraju Car : ఏలూరు జిల్లా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. కారులో ఇంటికి వెళ్తుండగా జీలుగుమిల్లి మండలం బర్రిలంకలపాడు సమీపంలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో కారు వెనుక అద్దాలు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తు ఆ కారులో ఎమ్మెల్యే బాలరాజు లేరు. దాని వెనుకున్న మరో కారులో ఆయన ఉన్నారు. ఆ కారులోనే ఎమ్మెల్యే ఉన్నారని భావించి దుండగులు బర్రిలంకలపాడు అడ్డ రోడ్డు వద్ద దాడి చేశారు. వెంటనే కారులో ఉన్న ఎమ్మెల్యే అనుచరులు ముగ్గురు కిందకు దిగి దాడికి పాల్పడ్డ వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే, వారు అక్కడి నుంచి పరారయ్యారు. చీకటి పడటంతో దాడికి పాల్పడ్డ వారిని గుర్తించలేకపోయామని ఎమ్మెల్యే అనుచరులు తెలిపారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే బాలరాజు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వాహనంపై చోటు చేసుకున్న రాళ్ళ దాడిని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. బర్రింకలపాడు గ్రామంలో కొందరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. దాడి సమయంలో ఎమ్మెల్యే వాహనంలో లేకపోవడం వల్ల ఎలాంటి హాని జరగలేదు. ఈ ఘటనకు కారకులైన వారిని పోలీసులు తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. పోలవరం ఎమ్మెల్యే వాహనంపై దాడి ఘటనకు సంబంధించి పోలవరం డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి స్పందించారు. పోలవరం ఎమ్మెల్యే బాలరాజు కారుపై జరిగిన దాడిని అన్ని కోణాల్లో విచారిస్తున్నామని చెప్పారు. ఆకతాయిల చేసిన పనా.. ఉద్దేశపూర్వకంగా జరిపిన దాడా? అనే కోణంలో విచారణ జరుపుతున్న చెప్పారు. కారుపై దాడి జరిగిన వెంటనే ఈ ప్రాంతాన్ని సందర్శించి చుట్టుపక్కల విచారణ జరపడం జరిగిందని చెప్పారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి విచారణ జరుపుతున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
Admin
Studio18 News