Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : AP CM Relief Fund : ఏపీలో ఇటీవల భారీ వర్షాలకుతోడు, బుడమేరు నీరు పోటెత్తడంతో విజయవాడలోని పలు ప్రాంతాలు వరద ముంపునకు గురైన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్ కార్యాలయంలోనే మకాంవేసి.. ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేయడంతోపాటు.. తానే స్వయంగా ముంపు ప్రాంతాల్లో పరిశీలనకు వెళ్లి బాధితులకు భరోసానిచ్చారు. అంతేకాక.. ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు ఆహారం, నీళ్లు, బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. దాదాపు నాలుగైదు రోజుల పాటు ప్రజలు ముంపులోనే ఉన్నారు. ప్రభుత్వం వారికి అన్ని విధాల సహాయసహకారాలు అందించింది. వరదల బాధితుల సహాయంకోసం సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు వెల్లువెత్తాయి. సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు వచ్చాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. వరద సమయంలో అందరం కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లినట్లు తెలిపారు. విరాళాల కోసం రాష్ట్ర ప్రజలంతా బ్రహ్మాండంగా స్పందించారు.. వరద బాధితులకు సాయం చేద్దామని పిలుపునిస్తే అంతా ముదుకొచ్చారని అభినందించారు. ఇప్పటి వరకు సీఎం సహాయ నిధికి రూ. 400 కోట్లు వచ్చాయని.. ఇంత పెద్దమొత్తంలో విరాళాలు రావడం ఒక చరిత్ర అని చంద్రబాబు అన్నారు. చిన్నా పెద్దా అందరూ స్పందించి విరాళాలు అందజేయడం మంచి పరిణామం, విరాళాలు ఇచ్చిన వారందరికీ చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. రూ. 602 కోట్లు ఇప్పటి వరకు బాధితులకు విడుదల చేశామని.. ఇందులో రూ. 400 కోట్లు దాతలు ఇచ్చినవేనని అన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా 16 జిల్లాల్లో మొత్తం రూ. 6,800 కోట్లు నష్టం జరిగిందని చంద్రబాబు తెలిపారు.
Admin
Studio18 News