Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Kadambari Jethwani Case: ముంబయి నటి కాదంబరి జెత్వానీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితుడుగాఉన్న వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్ ను గత మూడు రోజుల క్రితం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ లో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా అతన్ని ఆదివారం అర్థరాత్రి సమయంలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. అక్కడి నుంచి వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి విద్యాసాగర్ ను తరలించి అక్కడ అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం సోమవారం తెల్లవారు జామున చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో ఎదుట ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి విచారణ జరిపి వచ్చే నెల 4వ తేదీ వరకు రిమాండ్ విధించారు. అనంతరం విజయవాడ సబ్ జైలుకు నిందితుడు కుక్కల విద్యాసాగర్ ను తరలించారు. ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో విద్యాసాగర్ ఏ1గా ఉన్నాడు. వైసీపీ ప్రభుత్వం హయాంలో తన స్థలానికి సంబంధించిన నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి విక్రయించేందుకు ప్రయత్నించిందని తప్పుడు ఆరోపణలతో నటి జెత్వానీపై విద్యాసాగర్ ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను పోలీసులు ఏపీకి తీసుకొచ్చి అరెస్టు చేసి వేధించినట్లు జెత్వానీ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే జెత్వానీపై అక్రమంగా కేసు బనాయించి ఇబ్బందులకు గురిచేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులు, ఏసీపీ, సీఐలను ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. జెత్వానీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులో ప్రమేయం ఉన్న మరికొందరిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదిలాఉంటే. నటి కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఐపీఎస్ అధికారి కాంతారాణా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ ఆ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ జరిపే అవకాశం ఉంది. ఇప్పటికే కాంతిరాణాను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నటి జెత్వానీ కేసులో నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించారని ఆయన్ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
Admin
Studio18 News