Studio18 News - ANDHRA PRADESH / : ఆధార్ కార్డ్.. సిమ్ కార్డు కొనుగోలు చేయడం మొదలు ప్రభుత్వ సంక్షేమ పథకం వరకు ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. ఇంతటి కీలకమైన కార్డులో మార్పులు చేర్పులు చేయాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా నిరక్షరాస్యులైన వృద్ధులు పుట్టిన తేదీ నమోదులో, మార్పులు చేర్పులు చేయడానికి అవస్థ పడే పరిస్థితి నెలకొంది. వయసు నిర్ధారణ విషయంలో ప్రూఫ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా ఆధార్ లో వయస్సు ధ్రువీకరణకు పదో తరగతి మెమో లేదా స్టడీ సర్టిఫికెట్ తప్పనిసరి. చదువుకోని వారికి ఈ సర్టిఫికెట్లు లేక డేటాఫ్ బర్త్ లో మార్పులు చేసుకోవడం కష్టమవుతోంది. ఈ విషయం గుర్తించిన ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిరక్షరాస్యులైన వృద్ధుల ఆధార్ కార్డులో పుట్టిన తేదీలో మార్పులు చేర్పులకు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఇచ్చే వయస్సు ధ్రువీకరణ పత్రాలను అనుమతించాలని నిర్ణయించింది. పంచాయితీ కార్యదర్శులు, మున్సిపల్ కమిషనర్లు అందించే సర్టిఫికెట్ల మాదిరిగానే ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఇచ్చే పత్రాలను ప్రూఫ్ గా అంగీకరించేలా మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సర్టిఫికెట్ దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోనుంది. ప్రతీ సర్టిఫికెట్ పై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఈ నిర్ణయం అమలులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లోని నిరక్షరాస్యులైన వృద్ధులకు మేలు కలగనుంది.
Also Read : సంపద సృష్టించడం అంటే పన్నులు పెంచడమా?: మార్గాని భరత్
Admin
Studio18 News