Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు గుంటూరులోని నగరంపాలెం పోలీసు స్టేషన్‌లో సునీల్ కుమార్‌పై నమోదైన హత్యాయత్నం కేసుపై ఆయన సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యలు చేయడాన్ని ప్రభుత్వం తప్పుబట్టింది. ఆయన చేసిన వ్యాఖ్యలు అఖిల భారత సర్వీస్ (ప్రవర్తన) నియమావళి ఉల్లంఘన కిందకు వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. దీనిపై మాజీ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. పీవీ సునీల్ కుమార్‌పై ఏపీ ప్రభుత్వ దాడిని పూర్తిగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. ఆయన ట్విట్టర్‌లో పెట్టిన పోస్టులో తప్పేముందని అగ్రహం వ్యక్తం చేశారు. మీ విజ్ఞతకే వదిలేస్తున్నానని అనడం సర్వీసు రూల్ ఉలంఘన ఎట్లా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఆర్టికల్ 19 మళ్లీ మళ్లీ చదివితే అప్పుడయినా విషయం అర్ధం అవుతుందేమోనని ఎద్దేవా చేశారు. ఇలానే మీ దాడులు కొనసాగితే అఖిల భారత సర్వీస్ అధికారులు ఎవరూ కూడా ప్రజలకు సేవ చేయడానికి ఆసక్తి చూపించరని ఆయన అన్నారు. అనుభవజ్ఞుడైన అడ్మినిస్ట్రేటర్‌ను అని చెప్పుకుంటూ ఇలా దౌర్జన్యాలను నిరంతరం కొనసాగిస్తున్నందుకు విచారంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి ప్రవీణ్ కుమార్ విమర్శించారు.
Admin
Studio18 News