Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, రెండోసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు నేడు బడ్జెట్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. అసెంబ్లీ కమిటీ హాల్ లో జరిగిన ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు శాసనసభ్యులతో మాట్లాడారు. వారికి సభా కార్యక్రమాలపై అవగాహన కలిగించడంతో పాటు, రాజకీయ కెరీర్ పైనా విలువైన సూచనలు అందించారు. చంద్రబాబు వ్యాఖ్యల హైలైట్స్... బడ్జెట్ సమావేశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన ఉండాలి... మీకు వచ్చే మంచి ఆలోచనలు సభలో పంచుకోండి. ప్రభుత్వం తెచ్చే బిల్లులు, పాలసీలపై ప్రతి ఎమ్మెల్యే అధ్యయనం చేయాలి. పబ్లిక్ గవర్నెన్స్ లో ఎమ్మెల్యేలనూ భాగస్వామలను చేస్తాం. ప్రజలు మనపై అనేక ఆశలు పెట్టుకున్నారు... నమ్మకం పెట్టుకున్నారు. ప్రజల నమ్మకం మేరకు వారి సమస్యలపై సభలో చర్చించాలి. అర్థవంతమైన చర్చలకు సభ వేదిక కావాలి నేను 1978లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచాను... 1980లో మంత్రి అయ్యాను. ఇప్పటికి 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను... 4 సార్లు సీఎం అయ్యాను. వరుసగా విజయం సాధించడం అనేది మన పనితనం, పార్టీ నిర్మాణాన్ని బట్టి ఉంటుంది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. చాలామంది కొత్త వ్యక్తులు ఎమ్మెల్యేలుగా వచ్చారు. టీడీపీ నుండి 61 మంది, జనసేన నుండి 15 మంది, బీజేపీ నుండి నలుగురు, వైసీపీ నుండి నలుగురు ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికయ్యారు. మొత్తం 84 మంది కొత్తవారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండో సారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు 30 మంది టీడీపీ నుంచి ఉన్నారు. ఒకప్పుడు అసెంబ్లీ ప్రొసెడింగ్స్ ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ లో వచ్చేవి. కానీ ఇప్పుడు లైవ్, సోషల్ మీడియాలో కూడా ప్రసారం అయ్యే దాకా టెక్నాలజీ వచ్చింది. ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళం సభలో పబ్లిక్ పాలసీలు రూపొందిస్తాం. ఈ పాలసీలు ప్రజా జీవితంలో మార్పులు తెస్తాయి. గతంలో కొందరు ఎమ్మెల్యేలను విదేశాలకు పంపి ఆయా దేశాలు సాధించే ఫాస్ట్ గ్రోత్ రేట్ గురించి స్టడీ చేయించాం. మనం తెచ్చే పాలసీలే రాష్ట్రంలోని సమస్యలకు శాశ్వత పరిష్కారాలను చూపిస్తాయి. గతంలో ఒక సబ్జెక్టుపై ఎంత సమయమైనా చర్చించేవాళ్లం. రానురాను ఎమ్మెల్యేలకు సబ్జెక్టు నేర్చుకోవాలనే ఆసక్తి తగ్గుతోంది. ఇది మంచిది కాదు. నిరంతరం నేర్చుకోవాలి. తెలుసుకోవాలి. మీలో ఇప్పుడు ఎవరు ఏ సబ్జెక్టు మాట్లాడుతున్నారో నేను కూడా నోట్ చేసుకుంటున్నా. శాఖల్లో ఏం జరుగుతుందో మీకు అవగాహన లేకపోతే నియోజకవర్గానికి ఏం అవసరమో మీకు తెలియదు. బడ్జెట్ సమావేశాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం. అసెంబ్లీలో నాడు ఎన్టీఆర్, సుందరయ్య ఏం మాట్లాడారో ఇప్పుడు పుస్తకాల రూపంలో వస్తున్నాయి. కేంద్రం కూడా ఎంపీలకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ లు పెడుతోంది. మీ నాలెడ్జ్, వినూత్న ఆలోచనలను సభలో పంచుకుంటే తప్పకుండా వినియోగించుకుంటాం. కేంద్ర బడ్జెట్ లో కూడా ఏ విధమైన నిధుల కేటాయింపులు ఉన్నాయో స్టడీ చేసుకుంటే మీకు ఉపయోగపడుతుంది. పని చేయాలన్న ఆసక్తి మీలో ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. మీరంతా ఆదర్శవంతమైన ఎమ్మెల్యేలుగా ఉండాలి. సభలో ప్రతిపక్షం లేదు కదా మనకేముంది అని అనుకోవద్దు. వాళ్లకు బాధ్యత లేదు... కానీ మనకు ఉంది. మనం ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దాం. ప్రజలకు ఏం అవసరమో... ప్రజలకు ఏం చేశామో చెప్పడానికి అసెంబ్లీ ఒక వేదిక. అసెంబ్లీకి మేము పంపిన ప్రతినిధి మా కోసం ఏం మాట్లాడుతున్నారని ప్రజలు ఎప్పుడూ గమనిస్తారు సమస్యలపై మాట్లాడకుండా బూతులు తిడితే ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో స్వాగతించరు. గతంలో అదే జరిగింది విజన్-2047పై మీ అందరి అభిప్రాయాలు తెలియజేయండి. మంచి చర్చ, సమస్యల పరిష్కారానికి శాసన సభ, శాసన మండలి ఇకపై వేదికగా నిలవాలి.
Also Read : పగ - ప్రతీకారాల మధ్య సాగే 'మిథ్య' సీజన్ 2'
Admin
Studio18 News