Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) పై అధిపత్యాన్ని వైసీపీ వదులుకుంది. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల కారణంగా ఏసీఏ అధ్యక్షుడు సహా ఇతరులు రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి బంధుగణం ఏసీఏ ను తమ అధీనంలోకి తీసుకుందన్న విమర్శలు ఉన్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు పి.శరత్ చంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడు పి.రోహిత్ రెడ్డి, కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి సహా ఇతరులు రాజీనామా చేయడంతో .. శనివారం విజయవాడలోని ఓ హోటల్ లో నిర్వహించిన ఏసీఏ ప్రత్యేక సర్వసభ్య సమావేశం దానిని ఆమోదించింది. నూతన అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటునకు 35 నుండి 40 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నందున అప్పటి వరకూ ఏసీఏ సేవలకు అంతరాయం కలగకుండా ముగ్గురు సభ్యుల కమిటీని నియమించారు. మాజీ మంత్రి కె. రంగారావుతో పాటు, మాంచో ఫెర్రర్, జె మురళీ మోహన్ సభ్యులుగా వ్యవహరిస్తారని సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. వచ్చే నెల (సెప్టెంబర్) 8న గుంటూరులో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని నిర్ణయించిన సర్వసభ్య సమావేశం .. ఎన్నికల పర్యవేక్షలుగా రిటైర్డ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను నియమించింది. ఈ సర్వసభ్య సమావేశానికి 33 మంది సభ్యులు హజరుకాగా, సమావేశానికి విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చైర్మన్ గా వ్యవహరించారు. సమావేశం అనంతరం విష్ణుకుమార్ రాజు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మీడియాతో మాట్లాడారు. ఎన్నికల తర్వాత సభ్యులందరం కలిసి క్రికెటర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, స్టేడియాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Admin
Studio18 News