Studio18 News - ANDHRA PRADESH / : ప్రాణహాని ఉన్న జగన్ కు భద్రత తగ్గించారని, ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ కు ఆరుగురితో సెక్యూరిటీ ఏర్పాటు చేశారని వైసీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై ఏపీ పోలీస్ శాఖ స్పందించింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారం అని స్పష్టం చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు చాలా దూరంగా ఉన్నాయని పేర్కొంది. ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ చట్టం-2023 ప్రకారం ముఖ్యమంత్రితో పాటు, ఆయన కుటుంబ సభ్యులకు కూడా భద్రత కల్పించాలని చెబుతోందని ఏపీ పోలీస్ శాఖ వివరించింది. ఎస్ఎస్ జీ-2023 చట్టం ప్రకారం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కూడా ఎస్ఎస్ జీ భద్రతకు అర్హులైనప్పటికీ, వారు ఎస్ఎస్ జీ నుంచి కానీ, ఐఎస్ డబ్ల్యూ నుంచి కానీ ఎలాంటి భద్రతను వినియోగించుకోవడంలేదని స్పష్టం చేసింది. నారా దేవాన్ష్ విషయంలోనూ ఇదే జరుగుతోందని, దేవాన్ష్ రాష్ట్ర భద్రతను వినియోగించుకోవడంలేదని ఏపీ పోలీస్ శాఖ తేల్చి చెప్పింది.
Admin
Studio18 News