Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదలతో ఆంధ్రప్రదేశ్ చిగురుటాకులా వణికిపోయింది. ముఖ్యంగా విజయవాడ సగానికి పైగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీనికి ప్రధాన కారణం బుడమేరు వాగు వరద పోటెత్తడమే. దీంతో గడిచిన నాలుగు రోజులుగా ప్రజలు వరదనీటిలోనే ఉంటున్నారు. ఇక వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయనకు తోడుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యం పర్యటిస్తున్నారు. ఆహార పదర్థాలు, ఇతర సామగ్రిని అందించడం చేస్తున్నారు. ఇలా ప్రత్యక్షంగా సహాయ చర్యల్లో పాల్గొంటూ సీఎం బాధితులకు మేము ఉన్నామంటూ భరోసా ఇస్తున్నారు. అయితే, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఇక వరద ముంపు ప్రాంతాల్లో జనసేనానిని పర్యటించకపోవడంపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. ఇంతకుముందు ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా అక్కడికి వెళ్లిన పవన్ ఇప్పుడు ఇంత పెద్ద విలయం తాండవం చేస్తుంటే ఎందుకు బయటకు రావడం లేదంటూ విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో తనపై వస్తున్న విమర్శలపై పవన్ స్పందించారు. తనకు బాధితుల వద్దకు వెళ్లి పరామర్శించాలని ఉందనీ, అయితే, తాను వెళ్లిన చోట అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున తరలివస్తారని, దాంతో బాధితులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అన్నారు. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని తెలిపారు. అందుకే తన పర్యటన బాధితులకు సహాయపడేలా ఉండాలే తప్పితే, ఆటంకంగా పరిణమించకూడదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఇక కొందరు కావాలని విమర్శించడం తప్పితే, చేసేదేమీ ఉండదని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చురకలంటించారు. ఇదిలాఉంటే.. రెండు తెలుగు రాష్ట్రాలకు వరద బాధితులకు జనసేనాని రూ. 50లక్షల చొప్పున విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. పవన్‌తో పాటు తెలుగు చిత్రసీమకు చెందిన పలువురు కూడా వరద సహాయ నిధికి భారీగా విరాళాలు ఇస్తున్నారు.
Admin
Studio18 News