Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : విజయవాడ ప్రకాశం బ్యారేజీ గేట్లకు ఢీకొన్న పడవల తొలగింపు పనులు మూడు రోజులుగా కొనసాగుతున్నాయి. 67,68,69 గేట్ల వద్ద నాలుగు పడవలు చిక్కుకోగా, ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం నుండి వాటి తొలగింపు ప్రక్రియను ఆరంభించారు. ముందుగా ఓ భారీ పడవను ముక్కలు చేయడం ప్రారంభించారు. పడవలు అధిక బరువు, మధ్యలో మూడు లేయర్లతో ఇనుపగడ్డర్లు ఉండటంతో వాటిని అడ్డంగా కోసేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. విశాఖపట్నం నుండి వచ్చిన డైవింగ్ బృందం గంటల తరబడి నది లోపల 12 అడుగుల లోతుకు వెళ్లి బోటును గ్యాస్ కట్టర్లతో ముక్కలు చేస్తున్నారు. నిన్నటి వరకూ 40 మీటర్ల వెడల్పు ఉన్న ఒక బోటును ముక్కలు చేయడం దాదాపు పూర్తి చేశారు. ఈ రోజు బోటును రెండు ముక్కలుగా చేసి బయటకు తరలించే ఏర్పాట్లు చేశారు. 40 టన్నులకు పైగా బరువు ఉన్న బోటును రెండు ముక్కలుగా చేయడంతో ఒక్కొక్కటీ 20 టన్నుల బరువు ఉంటుందని అధికారులు చెప్పారు. నదిలో తేలుతూ పది టన్నులు బరువు మోయగలిగే పది ఎయిర్ బెలూన్లు ఏర్పాటు చేసి వాటి సాయంతో బోటు భాగాలను బయటకు తీసేందుకు తొలుత ఏర్పాట్లు చేశారు. అయితే నదిలో 60 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండటంతో సాధ్యపడదని అధికారులు భావిస్తున్నారు. ఇక బోటు ముక్కలు నది లోపల చిక్కుకోకుండా వాటిని బయటకు తరలించేందుకు నిపుణులను రప్పించారు. గతంలో గోదావరిలో కచ్చులూరు వద్ద మునిగిన బోటును వెలికి తీసిన బృందాన్ని విజయవాడకు పిలిపించారు. ఈరోజు మధ్యాహ్నం ముందుగా బ్యారేజీపైకి భారీ క్రేన్ లను తీసుకువచ్చి ముక్కలు చేసిన బోటు భాగాలను పైకి తీస్తారు. అనంతరం బ్యారేజీ వెనుక వైపు నుండి భారీ ఫంటును తీసుకొచ్చి బోటు విడిభాగాలను ఫంటుపైకి ఎక్కించి బయటకు తరలించేలా ప్లాన్ చేశారు. ఒకవేళ ఆ విధంగా కుదరకపోతే.. కోసిన బోటు భాగాన్ని మరో భారీ పడవకు కట్టి నదిలో వెనక్కి లాగడం ద్వారా బయటకు తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నానికి ఒక పడవను తొలగించిన తర్వాత మిగిలిన రెండు భారీ పడవలను తొలగించడంపై అధికారులు దృష్టి పెట్టనున్నారు.
Admin
Studio18 News