Studio18 News - ANDHRA PRADESH / : Prakasam Barrage Boats Incident : ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న 5 బోట్ల ఘటన వెనుక కుట్ర కోణం బలపడుతోందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వీటిల్లో ఒకే యజమానికి సంబంధించినవి 3 బోట్లు ఉన్నాయని ఆయన చెప్పారు. లంగర్ వేయకుండా 3 బోట్లను ప్లాస్టిక్ తాడుతో కట్టడం, బోటు యజమాని వైసీపీ నేత కావటం కుట్రకోణం బలపడుతోందన్నారు. నందిగం సురేశ్, తలశిల రఘురామ్ లకు ఈ బోటు యజమాని ఉషాద్రి రామ్మోహన్ దగ్గరి మనిషి అని మంత్రి నిమ్మల చెప్పారు. బోట్లకు వైసీపీ రంగులు ఉండటం, ఉద్దండరాయినిపాలెం వైపు ఉండే బోట్లు వరద వచ్చే సమయంలోనే ఇవతలి వైపు రావటం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. రాజధానిపై ద్వేషంతో గతంలో అరటి తోటలు తగలపెట్టడం, సొంత బాబాయ్ ని కూడా హత్య చేసిన చరిత్ర వైసీపీ నేతలది అని ఆరోపించారు మంత్రి నిమ్మల. పైస్థాయి ఆదేశాలు లేకుండా దాదాపు కోటిన్నర విలువ చేసే బోట్ల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉండరని మంత్రి అన్నారు. వైసీపీ నేతలు బుడమేరు కట్ట మీద మట్టి దోచుకెళ్లారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన పాపానికి విజయవాడ మునిగిందని ఆయన మండిపడ్డారు. వైసీపీ నేతలు పడవలు తెచ్చి ప్రకాశం బ్యారేజీని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారని ఆరోపణలు చేశారు. విజయవాడలో వరదలు వస్తే.. 9 రోజులుగా చంద్రబాబు కలెక్టరేట్ లోనే ఉండి.. కేంద్ర మంత్రులను పిలిపించుకుని వరద కష్టాలు, నష్టాలు వివరించారని.. చంద్రబాబు పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బోట్లు తీసేయడానికి కొంత సమయం పడుతుంది- కన్నయ్యనాయుడు, ఏపీ జలవనరుల శాఖ అడ్వైజర్ ఈరోజు సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్ గేట్ల పని పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పచెబుతాం. 2012లో గేట్లు మార్చారు. 11 లక్షల వరద నీరు ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులు కలగలేదు. బోట్లు రావటం వల్లే ప్రకాశం బ్యారేజ్ కి ఇప్పుడు ఇబ్బంది కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం 15 లక్షల క్యూసెక్కుల వరద నీరు వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటుంది. విజయవాడ వైపున ఉన్న ప్రకాశం బ్యారేజీ చిన్న గేట్లు కొంచెం స్ట్రన్ చేయాల్సిన అవసరం ఉంది. వాటర్ తగ్గిన తర్వాత గేట్లు స్ట్రన్ చేసేందుకు నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. గెస్ట్ హౌస్ వద్ద నుండి ఫీల్ చేసుకుంటూ బోట్లని తొలగించాలి. నదిలో ఉన్న బోట్లు ఇక్కడి నుంచి తీసేయడానికి కొంత సమయం పడుతుంది.
Admin
Studio18 News