Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ రాజధాని అమరావతి నిర్మాణంపై స్పందించారు. డిసెంబరు 1 నుంచి అమరావతి నిర్మాణ పనులు షురూ అవుతాయని వెల్లడించారు. నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం రూ.60 వేల కోట్లు ఖర్చవుతుందని భావిస్తున్నామని నారాయణ పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. అమరావతి సహా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇవాళ కృష్ణా జిల్లా కంకిపాడులో క్రెడాయ్ సౌత్ కాన్-2024 సదస్సు ప్రారంభం కాగా... ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ విచ్చేశారు. ఈ సందర్భంగానే ఆయన పైవ్యాఖ్యలు చేశారు. ఇక, నిర్మాణ రంగ అభివృద్ధికి అధికారులతో సమీక్షిస్తున్నామని పేర్కొన్నారు. సింగిల్ విండో అనుమతుల విధానానికి తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి నారాయణ చెప్పారు. బిల్డర్లకు సత్వరమే అనుమతులు మంజూరు చేసేందుకు ఓ సాఫ్ట్ వేర్ ను తీసుకువస్తామని వెల్లడించారు.
Admin
Studio18 News