Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Gudlavalleru Engineering College Incident: కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. హిడెన్ కెమెరాలు ఉన్నాయనే అంశంపై లోతుగా విచారణకు చేపట్టాలన్నారు. కాగా, శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ వాష్ రూంలలో సీక్రెట్ కెమెరాలు పెట్టి 300 పైగా వీడియోలు రికార్డ్ చేసి అమ్ముకున్నారని ఆరోపణలు రావడంతో విద్యార్థులు గురువారం రాత్రి ఆందోళ చేపట్టారు. ఈ కేసులో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి విచారిస్తున్నారు. మంత్రి నారా లోకేశ్ ఆరా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఆరా తీశారు. ”కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నాను. హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించాను. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు. ఇటువంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చాను. కళాశాలల్లో ర్యాగింగ్, వేధింపులు లేకుండా యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాల”ని ఆదేశాలిచ్చినట్టు ట్వీట్ చేశారు. ఖండించిన గుడివాడ ఎమ్మెల్యే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనను గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఖండించారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీచేశారు. విద్యార్థులు ఆందోళన చెందవద్దని, అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే.. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై స్పందించారు. ఈ ఘటన వెనుక ఎంతటి వారున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమన్నారు. విద్యార్థులు అపోహలను నమ్మవద్దని, ఆధారాలు లేని విషయాలను ప్రచారం చేయవద్దని ఎమ్మెల్యే రాము కోరారు. ఆధారాలు దొరకలేదు: కృష్ణా జిల్లా ఎస్పీ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనను కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ రావు తెలిపారు. గర్ల్స్ హాస్టల్ వాష్ రూముల్లో ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించలేదని, అమ్మాయిలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నిందితుడి ల్యాప్‌టాప్, మొబైల్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను పరిశీలించామని.. నేరం రుజువయ్యే విధంగా ఆధారాలు లభించలేదని చెప్పారు. తప్పు చేసిన వారిని గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హామీయిచ్చారు. కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వద్ద శుక్రవారం కూడా విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. వి వాంట్ జస్టిస్ అంటూ అంటూ నినాదాలు చేస్తున్నారు. కాగా, నేరం రుజువయ్యే విధంగా ఆధారాలు లభించలేదన్న కృష్ణా జిల్లా ఎస్పీ ప్రకటనపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. స్పందించిన హోంమంత్రి కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థినుల ఆందోళనపై స్పందించిన హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి.. హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఇటువంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను హోంమంత్రి ఆదేశించారు.
Admin
Studio18 News