Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : తనపై నిర్వహిస్తున్న రాష్ట్ర విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ విచారణను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. తాను టీటీడీ ఛైర్మన్ గా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు, నిధుల దుర్వినియోగం ఆరోపణలతో తనపై విచారణ జరుపుతున్నారని పిటిషన్ లో తెలిపారు. తాను తీసుకున్న నిర్ణయాలపై వివరణ ఇవ్వాలని విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్పీ అడిగారని... తనపై ఏ ఆరోపణలు ఉన్నాయో చెప్పాలని, వాటికి సంబంధించిన ఫైళ్లు ఇవ్వాలని కోరినా ఆయన స్పందించలేదని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తాను వివరణ ఇవ్వకుండానే విచారణను పూర్తి చేశారని తెలిపారు. టీటీడీకి సంబంధించిన వ్యవహారాల్లో విచారణ జరిపే అధికారం రాష్ట్ర విజిలెన్స్ విభాగంకు లేదని అన్నారు. టీటీడీకి స్వయం ప్రతిపత్తి ఉందని... టీటీడీ అంతర్గత వ్యవహారాలను విచారించేందుకు సొంత విజిలెన్స్ విభాగం ఉందని చెప్పారు. అందువల్ల రాష్ట్ర విజిలెన్స్ విచారణ ప్రక్రియను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును కోరారు. ఏపీ చీఫ్ సెక్రటరీ, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవో, విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్, ఎస్పీలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్ పై హైకోర్టు సోమవారం విచారణ జరపనుంది.
Admin
Studio18 News