Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : బుడమేరుకు పడిన మూడు గండ్లు ఎంతటి ఉపద్రవాన్ని తెచ్చిందో అందరికీ తెలిసిందే. విజయవాడ నగర చరిత్రలోనే కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పంజా విసిరింది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు వరద తగ్గుతుందని ప్రభుత్వం భావించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు గండ్లు పూడ్చివేత పనులను యుద్ద ప్రాతిపదికన చేపట్టగా, నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా అక్కడే ఉండి పనులు పర్యవేక్షించారు. ఈ విషయంలో మంత్రి నిమ్మల చూపించిన ప్రత్యేక చొరవ అందరినీ ఆకట్టుకుంది. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సహా సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజలు ఆయనను అభినందించారు. నిన్న (శనివారం) గండి పూడ్చివేత పనులు పరిశీలించేందుకు వెళ్లిన మంత్రి నారా లోకేశ్ .. ప్రజల కోసం మీరు చూపిస్తున్న నిబద్దత అభినందనీయమంటూ మంత్రి నిమ్మలను కొనియాడారు. ఓ రాత్రి సమయంలో భారీ వర్షం, గాలి వస్తున్నా గొడుగు పట్టుకుని మరీ వర్షంలోనే నిమ్మల పనులు పర్యవేక్షించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు సైతం నిమ్మలను అభినందించారు. కాగా, బుడమేరు గండ్లు పూర్చివేత పనులు పూర్తి అయిన తర్వాత మంత్రి నిమ్మల చంద్రబాబును కలిశారు. పనులు జరిగిన తీరును వివరించారు. మూడు గండ్లను పూర్తిగా పూడ్చి వేశామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని వివరించారు. ఈ సందర్భంగా గుడ్ జాబ్ రామానాయుడు అంటూ చంద్రబాబు ఆయన్ను ప్రశంసించారు. ఇదే సందర్భంలో గండ్లు పూడిక పనుల్లో పాల్గొన్న ఇరిగేషన్ అధికారులను సైతం సీఎం అభినందించారు.
Admin
Studio18 News