Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో 1994 నుంచి 2004 వరకు చంద్రబాబు హయాంలో జరిగిన అవగాహన ఒప్పందాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, న్యాయవాది టి.శ్రీరంగరావు, ఏబీకే ప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు నిన్న కొట్టివేసింది. 2012 నాటి ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జిస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె. శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది. ఈ విషయంలో న్యాయస్థానం ఆదేశాలు జారీచేయాలంటే కోర్టును ఆశ్రయించే వ్యక్తి నిజాయతీతో, సదుద్దేశంతో ఉండాలని, వాస్తవాలను దాచరాదని కోర్టు పేర్కొంది. చట్టం చదరంగం కాదని, వాస్తవాలతో కోర్టుకు రావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన తల్లి విజయమ్మ దాఖలు చేసిన పిల్‌లో, అనంతరం పాల్వాయి గోవర్థన్‌రెడ్డి దాఖలు చేసిన క్రిమినల్ కేసులోనూ ఐఎంజీ భారత అకడమీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు భూముల కేటాయింపు విషయం ఉన్నా దీనితోపాటు పలు విషయాలను దాచిపెట్టి విజయసాయిరెడ్డి తదితరులు సీబీఐ దర్యాప్తు కోరడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. ఇది రాజకీయ ప్రత్యర్థిని లక్ష్యంగా చేసుకోవడమే అవుతుందని పేర్కొంది. పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఏసీబీ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేయగా కొట్టివేసిందని, హైకోర్టు కూడా అదే పనిచేసిందని, ఈ పిటిషన్‌లో ప్రతివాదిగా ఉన్న అప్పటి మంత్రి రాములుకు, విజయసాయిరెడ్డి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారని వివరించింది. ఈ విషయాలన్నీ విజయసాయిరెడ్డికి తెలిసినా వాటిని ప్రస్తావించకుండా సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారని ఆక్షేపించింది. ఐఎంజీ భూముల వ్యవహారంలో 2006లో అప్పటి ప్రభుత్వం జీవో జారీచేసిందని, ఆరేళ్ల తర్వాత 2012లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారని, ఈ ఆరేళ్లపాటు పిటిషనర్లు ఏం చేశారని ధర్మాసనం ప్రశ్నిస్తూ పిటిషన్లను కొట్టివేసింది.
Admin
Studio18 News