Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : సినీ నటి కాదంబరీ జత్వానీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కాదంబరీ జత్వానీపై నమోదు చేసిన కేసులో ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాధారాలను తదుపరి విచారణ వరకూ భద్రపరచాలని ఇబ్రహీంపట్నం పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తాను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కాదంబరీపై ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ఇప్పటి వరకూ సీజ్ చేసిన మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలను నిందితురాలికి తిరిగి ఇవ్వకుండా భద్రపరిచేలా ఆదేశించాలని కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదులో కోరారు. ఈ కేసుపై మీడియాలో డిబేట్లు జరపకుండా నిలువరించాలని ఆయన కోరారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో నమోదు చేసిన కేసుకు సమాంతరంగా ఇదే వ్యవహారంపై మరో అధికారితో దర్యాప్తు చేయకుండా అడ్డుకోవాలని కోరారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పోలీసుల తరపున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ .. పిటిషనర్ వ్యాజ్యంలో వినతి అస్పష్టంగా ఉందని అన్నారు. ఈ పిటిషన్ మొదటి సారి విచారణకు వచ్చిందని, వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని కోరారు. ప్రస్తుతం అధికారులు అందరూ వరద సహాయక చర్యల్లో ఉన్నారని కోర్టుకు వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేస్తూ, తదుపరి విచారణ వరకూ సేకరించిన సాక్ష్యాధారాలు భద్రపరచాలని ఆదేశించారు.
Admin
Studio18 News