Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : భారీ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమైన విషయం తెలిసిందే. వరద ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్నవారు రోజులు గడుస్తున్నా ఇంకా బిక్కుబిక్కుమంటూనే గడుపుతున్నారు. చాలా మంది నిరాశ్రయులయ్యారు. దీంతో వరద బాధితులను ఆదుకునేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమవంతు సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు తెలుగు చిత్ర సీమకు చెందిన వారు విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే ఎన్‌టీఆర్, మహేశ్ బాబు, వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్, యువ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విష్వక్సేన్ తదితరులు వరద సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా తెలుగు రాష్ట్రాలకు రూ.కోటి విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణకు చెరో రూ. 50లక్షల చొప్పున ఇస్తున్నానని తెలిపారు. వరదలతో రెండు రాష్ట్రాల్లో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు తనను కలచివేస్తున్నాయని చిరు ట్వీట్ చేశారు. పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని అన్నారు. ఈ విపత్కర పరిస్థితులు త్వరగా తొలగిపోవాలని మెగాస్టార్ ఆకాంక్షించారు. "తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాలలో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అని చిరు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Admin
Studio18 News