Studio18 News - ANDHRA PRADESH / : తెలుగు రాష్ట్రాలను వరదలు కుదిపేయడం పట్ల టాలీవుడ్ యువ నటి అనన్య నాగళ్ల తనవంతుగా సాయం ప్రకటించడం తెలిసిందే. ఏపీకి రూ.2.5 లక్షలు, తెలంగాణకు రూ.2.5 లక్షలు ఇస్తున్నట్టు అనన్య సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. సినీ పరిశ్రమ నుంచి హీరోయిన్లలో విరాళం ఇచ్చింది అనన్య ఒక్కతేనని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆమె ప్రకటించింది చిన్నమొత్తమే కావొచ్చు కానీ, ఆమెది పెద్ద మనసు అంటూ ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఈ క్రమంలో, అనన్య నాగళ్ల ఏపీ ప్రభుత్వానికి విరాళం ఇవ్వడం పట్ల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. "ఆంధ్రప్రదేశ్ లో వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2.5 లక్షల విరాళం ప్రకటించిన వర్ధమాన నటి, కుమారి అనన్య నాగళ్ల గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాలకు మీ చేయూత బలాన్నిస్తుంది" అంటూ పవన్ కల్యాణ్ తరఫున ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. అందుకు అనన్య నాగళ్ల వినమ్రంగా స్పందిస్తూ, థాంక్యూ సో మచ్ సర్ అంటూ బదులిచ్చింది. మీరు నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం అంటూ ట్వీట్ చేసింది.
Admin
Studio18 News