Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ టీడీపీలో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా గుర్తింపు పొందిన వంగలపూడి అనిత... హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తనదైన శైలిలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. ఆ తర్వాత విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుండి అన్ని జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, నేర నియంత్రణ, ఇతర అంశాలపై జిల్లాల వారీగా సమీక్ష చేశారు. తాజాగా ఆమె అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు ఆమె ట్వీట్ చేశారు. పాయకరావుపేటలోని తన స్వగృహంలో నిన్న ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరిగిందని, ఆయా విన్నపాలను శాఖల వారీగా విభజించి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతోందని తెలిపారు. ప్రజల అర్జీలు ఎంత మేరకు పరిష్కారం అయ్యాయి... వాటి స్టేటస్ ఏమిటి? అనే విషయాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఆయా విన్నపాలపై ప్రతి వారం సమీక్షించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని వెల్లడించారు.
Admin
Studio18 News