Studio18 News - ANDHRA PRADESH / : Punganur Girl Case: పుంగనూరులో ఏడేళ్ల బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. దీంతో ఏడు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించినట్లయింది. తాజాగా ఈ ఘటనపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. పుంగనూరు బాలిక మృతి అందరినీ కలచి వేసిందని అన్నారు. కర్నూలులో లాగా మళ్ళీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ సీఎం వైఎస్ జగన్ పుంగనూరు పర్యటన ఖరారు చేశారని, జగన్ పర్యటన అనగానే హడావిడిగా ముగ్గురు మంత్రులు పుంగనూరులో పర్యటించారని, పోలీసులు కూడా ముగ్గురు దోషులను అరెస్టు చూపించారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నామని తెలిపారు. బాలిక మిస్సింగ్ కేసుకు సంబంధించిన నిందితులను పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుంగనూరు పర్యటన రద్దు చేసుకోవటం జరిగిందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఇదే శ్రద్ద కర్నూలు ఘటన జరిగినప్పుడు చూపించి ఉంటే ఆ అమ్మాయి ఆచూకీ లభించేదన్నారు. వైఎస్ జగన్ పర్యటిస్తే ఇక రాష్ట్రంలో చర్చ మొదలవుతుందని పుంగనూరు ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ప్రభుత్వమే దాడులకు ప్రేరేపిస్తోందని పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ పక్కన పెట్టి ప్రజలకు సంక్షేమం అందిస్తే బాగుంటుందని సూచించారు.
Admin
Studio18 News