Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : కేదార్ నాథ్ లో చిక్కుకున్న దాదాపు 20 మంది ఏపీ యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు మంత్రి నారా లోకేశ్ చర్యలు చేపట్టారు. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా వారు అక్కడ చిక్కుకుపోయారు. తమ సమస్యను యాత్రికులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా మంత్రి లోకేశ్ కు తెలియజేశారు. భోజనం కూడా దొరక్క ఇబ్బంది పడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన మంత్రి లోకేశ్ ప్రభుత్వం తరఫున ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందరూ సురక్షితంగా తిరిగి వచ్చేలా తాను బాధ్యత తీసుకుని దగ్గరుండి పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు. "కేదార్ నాథ్‍లో చిక్కుకున్న తెలుగు యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతున్నాం. ఈ లోగా వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉత్తరాఖండ్ ప్రభుత్వ సహకారాన్ని కోరాం. కేదార్ నాథ్ లో చిక్కుకున్న యాత్రికులు, వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండండి" అని మంత్రి లోకేశ్ భరోసా ఇచ్చారు. మరోవైపు టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న యాత్రికులకు ఫోన్‌చేసి మాట్లాడారు. అక్కడి నుంచి సురక్షితంగా తరలించేందుకు అధికారులతో మాట్లాడామని, యాత్రికులు ధైర్యంగా ఉండాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Admin
Studio18 News