Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి శ్రీ సిటీ పర్యటనకు విచ్చేశారు. శ్రీ సిటీలో వివిధ కంపెనీల సీఈవోలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పారిశ్రామికవేత్తలు సంపద సృష్టిస్తూ ఉపాధి కల్పిస్తున్నారని కొనియాడారు. ఇవాళ ఒకే చోట 30 కంపెనీల ప్రతినిధులతో భేటీ గొప్ప విషయం అని, ఇదొక అపూర్వ ఘట్టం అని పేర్కొన్నారు. పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని అన్నారు. 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయని, తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెట్టుబడులు రాబట్టేందుకు అనేక దేశాల్లో పర్యటించానని చంద్రబాబు వెల్లడించారు. భారత్ ను ఐటీ రంగం ప్రపంచపటంలో నిలుపుతుందని ఆనాడే చెప్పానని గుర్తుచేశారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా భారతీయులు కనిపిస్తారని, ప్రపంచంలోని ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒక భారతీయుడు ఉంటారని, ప్రతి నలుగురు భారతీయ ఐటీ నిపుణుల్లో ఒకరు ఏపీ వ్యక్తి ఉంటారని వివరించారు. అదీ ఏపీ సత్తా అని పేర్కొన్నారు. దేశంలో హైదరాబాదులో అత్యుత్తమ మౌలిక సదుపాయాలు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్ ప్రజల నివాసాలకు అనుకూల ప్రాంతంగా ఉందని పేర్కొన్నారు. గతంలో పీపీపీ విధానంలో హైటెక్ సిటీ నిర్మాణం చేపట్టామని తెలిపారు. శ్రీ సిటీలో 8 వేల ఎకరాల్లో పారిశ్రామిక జోన్లు ఏర్పాటయ్యాయని, ఇక్కడ సెజ్, డొమెస్టిక్ జోన్, ఫ్రీ ట్రేడ్ జోన్ ఏర్పాటయ్యాయని వివరించారు. ఇప్పటికే శ్రీ సిటీ నుంచి 220 కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని... ఇక్కడ ఆటోమేటివ్, ఎలక్ట్రానిక్స్, ఎఫ్ఎంసీజీ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు కూడా వచ్చాయని అన్నారు. 4.5 బిలియన్ డాలర్ల పెట్టుబడుల సాధన గొప్ప విషయం అని, 4 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించడం మామూలు విషయం కాదని చంద్రబాబు తెలిపారు. చెన్నై, కృష్ణపట్నం, తిరుపతి ప్రాంతాలకు శ్రీ సిటీ దగ్గరగా ఉందని, శ్రీ సిటీని అత్యుత్తమ ఎకనామిక్ జోన్ గా అభివృద్ధి చేయాలనేది తన ఆలోచన అని స్పష్టం చేశారు. శ్రీ సిటీకి ఐజీబీసీ గోల్డెన్ రేటింగ్ గుర్తింపు కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. శ్రీ సిటీకి అన్ని రకాల మౌలిక సౌకర్యాలు ఉన్నాయని, దీన్ని అత్యంత అనుకూల నివాసయోగ్య ప్రాంతంగా మార్చుతామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. శ్రీ సిటీలో సహజంగానే చల్లని వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కంపెనీలు వీలైనంతగా ఉత్పత్తి, లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించుకోవాలని... ఈ ధరల తగ్గింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఏపీ రాజధాని అమరావతి ప్రస్తావన తెచ్చారు. కొత్త రాజధాని అమరావతి నిర్మాణం చేపడుతున్నామని, రాజధాని నిర్మాణం కోసం 29 వేల మంది రైతులు 34 ఎకరాల భూమిని ఇచ్చారని వెల్లడించారు. ఇంటింటికీ తాగునీరు, విద్యుత్, ఫైబర్ నెట్ అందిస్తున్నామని... మున్ముందు గ్యాస్ తో పాటు ఏసీ కూడా పైప్ లైన్ల ద్వారా ఇంటింటికీ అందిస్తామని చంద్రబాబు తెలిపారు. పారిశ్రామికవేత్తలు వినూత్న ఆలోచనలతో ముందుకురావాలని కోరుతున్నానని పిలుపునిచ్చారు. 2029 నాటికి భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. తాము విజన్-2047 ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని వెల్లడించారు. 2047 నాటికి భారత్ నెంబర్ వన్, లేదా నెంబర్ టూ స్థానంలో ఉంటుందని జోస్యం చెప్పారు.
Admin
Studio18 News