Studio18 News - ANDHRA PRADESH / : తీవ్ర సంచలనం సృష్టించిన బాలీవుడ్ నటి కాదంబరీ జత్వాని కేసులో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీఐడీకి అప్పగించింది. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఈ కేసును విజయవాడ పోలీసులు దర్యాప్తు చేశారు. జత్వానిపై అక్రమంగా కేసు నమోదు, అరెస్టు వ్యవహారంలో పలువురు సీనియర్ పోలీస్ ఉన్నతాధికారుల ప్రమేయం బయటపడడంతో దీని వెనుక సూత్రధారులను కనిపెట్టేందుకు లోతైన దర్యాప్తు అవసరమని ప్రభుత్వం భావించింది. దీంతో ఈ కేసులకు సంబంధించి అన్ని రికార్డులను సీఐడీకి అప్పగించాలంటూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే జత్వాని ఫిర్యాదు మేరకు నాటి పోలీస్ ఉన్నతాధికారులపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ లు సీతారామాంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్నీ, ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జత్వాని కేసులో ఇప్పటికే వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు అరెస్టు చేశారు.
Admin
Studio18 News