Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో గతంలో గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసిన విధంగానే... ఇప్పుడు విశాఖ టీడీపీ ఎంపీ భరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రాజీనామా చేయాలంటూ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ పై గంటా మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా భరత్, పల్లా శాయశక్తులా కృషి చేస్తున్నారని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పల్లా శ్రీనివాసరావు ఆమరణదీక్షను కూడా చేపట్టారని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తాను గతంలో స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేశానని... తన రాజీనామాను స్పీకర్ ఆమోదించడం కూడా జరిగిందని గంటా చెప్పారు. కానీ అప్పుడు విజయసాయిరెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్టీల్ ప్లాంట్ పై సీఎం చంద్రబాబు దృష్టి సారించారని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కు కేంద్ర మంత్రి కుమారస్వామిని రప్పించారని... స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాదని కుమారస్వామి చెప్పారని తెలిపారు విజయసాయిరెడ్డి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. ఆయన రాజకీయాలు చేయాలనుకుంటే వేరేలా చేసుకోవడం మంచిదని సూచించారు. స్టీల్ ప్లాంట్ పై చిత్తశుద్ధి ఉంటే ఆనాడే రాజీనామా చేసి ఉంటే బాగుండేదని చెప్పారు.
Admin
Studio18 News