Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Mekapati Rajamohan Reddy: అమరావతిలో రాజధాని కరెక్ట్ కాదని శివరామకృష్ణ కమిటీ చెప్పినా చంద్రబాబు నాయుడు వినలేదని, ఇప్పుడు వరదలతో రాజధాని మునిగిపోయిందని వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, తన చిన్న కుమారుడు మేకపాటి విక్రమ్ రెడ్డి, పార్టీ నేతలతో కలిసి బుధవారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. ”వరద బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదుంది. జగన్ కోరిక మేరకు నా కుమారుడు గౌతమ్ రెడ్డి ఆత్మకూరు అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. తర్వాత మంత్రిగా చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి అని పేరు పెడితే.. దాన్ని తొలగించడం దారుణం. నెల్లూరు బ్యారేజీకి నిజాయతీపరుడుగా ఉన్న నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేరు పెడితే దాన్ని సైతం తీసేయ్యడం దుర్మార్గం. అధికారం శాశ్వతం కాదనే విషయాన్నీ చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలి. ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చెయ్యకపోవడం చంద్రబాబు ట్రాక్ రికార్డు. రాజశేఖరరెడ్డి చెప్పినవి, చెప్పనవి కూడా చేశారు. ఆయన బతికి ఉంటే మూడుసార్లు సీఎం అయ్యేవారు.. రాష్టం విడిపోయేది కాదు. శేష జీవితంలో అయినా ప్రజలకు మేలు చెయ్యాలనే ఆలోచన చంద్రబాబుకి రావాలి. వరద బాధితులకు నా వంతు సాయంగా ఏపీకి 25 లక్షలు, తెలంగాణకి 25 లక్షల రూపాయలు విరాళం ఇస్తున్నాన”ని మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రకటించారు. బ్యారేజీల పేర్లు మార్చడం సరికాదు: కాకాణి నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ పేర్లు మార్చడం సరికాదని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. ”గౌతమ్ రెడ్డి కోసమే జగన్ మూడు సార్లు జిల్లాకి వచ్చారు. ఆయన జ్ఞాపకర్థం సంగం బ్యారేజీకి ఆ పేరు పెట్టారు. వాటిని తొలగించడం వల్ల చంద్రబాబుకి వచ్చిన లబ్ది ఏంటో అర్ధం కాలేదు. బ్యారేజీల పేర్లు మార్చిన చంద్రబాబును ప్రజలు అసహ్యహించుకుంటున్నారు. రెండు బ్యారేజీలకి అంతకుముందున్న పేర్లు కొనసాగించాల”ని కాకాణి డిమాండ్ చేశారు.
Admin
Studio18 News